మహిళా పారిశ్రామికవేత్తల కోసం..ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ : మంత్రి సీతక్క 

మహిళా పారిశ్రామికవేత్తల కోసం..ప్రత్యేకంగా ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ : మంత్రి సీతక్క 
  • పెట్టుబడులు, మార్కెట్ అవకాశాల కల్పనే లక్ష్యంగా ఏర్పాటు
  • మహిళా పారిశ్రామికత సంక్షేమమే కాదు.. ఆర్థిక బలం: మంత్రి సీతక్క

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించేందుకు, వారి వ్యాపారాలకు అవసరమైన పెట్టుబడులు, మార్కెట్ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మహిళలకు సహకారం అందించేందుకు వీలుగా ప్రత్యేకంగా 'మహిళా పారిశ్రామికవేత్తల ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్'ను ఏర్పాటు చేసింది. డిసెంబర్ 7 నుంచి 9 వరకు హైదరాబాద్‌‌లోని భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న 'ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్–2026' సన్నాహకాల్లో భాగంగా ఈ కౌన్సిల్ ఏర్పాటైంది.

దీనికి సంబంధించిన తొలి సమావేశం సోమవారం సచివాలయంలో మంత్రి సీతక్క అధ్యక్షతన జరిగింది. వీ-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల కన్వీనర్‌‌గా వ్యవహరించే ఈ కౌన్సిల్‌‌లో విధాన నిర్ణేతలు, మహిళా పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, కార్పొరేట్ సంస్థల ప్రతినిధులు భాగస్వాములుగా ఉంటారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాల వరకు, స్వయం సహాయక సంఘాల నెట్‌‌వర్క్ ద్వారా మహిళలు విజయవంతంగా వ్యాపారాలు నడుపుతున్నారని తెలిపారు.

మహిళా వ్యాపారవేత్తలకు ఎదురవుతున్న సమస్యలు, అడ్డంకులను తొలగించేందుకు ప్రభుత్వం 'వీ-–హబ్' ద్వారా పూర్తి సహకారం అందిస్తుందని చెప్పారు. మహిళల్లో ఆశయాలు, నైపుణ్యాల కొరత ఏమాత్రం లేదని, పెట్టుబడులు, మార్కెట్ నెట్‌‌వర్క్‌‌ను చేరుకోవడంలోనే సవాళ్లు ఎదురవుతున్నాయని వీ-హబ్ సీఈవో సీత పల్లచోళ్ల తెలిపారు. ఈ కౌన్సిల్ సిఫారసుల ఆధారంగా రూపొందించే ప్రత్యేక శ్వేతపత్రాన్ని గ్లోబల్ సమ్మిట్ వేదికగా విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

ఆరోగ్యకర గ్రామాల నిర్మాణానికి కృషి చేయాలి

ఆరోగ్యకరమైన గ్రామాల నిర్మాణం, ప్రజల జీవన ప్రమాణాల పెంపునకు ప్రభుత్వం నిర్దేశించిన లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని స్పెషల్‌‌ సీఎస్‌‌ నవీన్‌‌ మిట్టల్‌‌కు మంత్రి సీతక్క సూచించారు. పంచాయతీరాజ్‌‌, గ్రామీణాభివృద్ధి శాఖ స్పెషల్‌‌ చీఫ్‌‌ సెక్రటరీగా నియమితులైన నవీన్‌‌ మిట్టల్‌‌ సోమవారం సచివాలయంలో మంత్రిని మర్యాదపూర్వకంగా కలిశారు. నూతన బాధ్యతలు చేపట్టిన ఆయనకు సీతక్క శుభాకాంక్షలు తెలిపారు.

మరోవైపు టీజీఈజేఏసీ చైర్మన్‌‌ వి.లచ్చిరెడ్డి, టీపీఎస్ఎఫ్‌‌ రాష్ట్ర అధ్యక్షుడు శ్రీకాంత్‌‌ గౌడ్‌‌ తదితరులు నవీన్‌‌ మిట్టల్‌‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. పంచాయతీ కార్యదర్శులు క్షేత్రస్థాయిలో ఎదుర్కొంటున్న పని ఒత్తిడి, సర్వీస్‌‌ సంబంధిత సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. వాటిని సానుకూలంగా పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కోరుతూ వినతిపత్రం అందజేశారు.